రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే ట్రాక్ పై  మంగళవారం నాడు పేలుడు కలకలం సృష్టించింది.రేణిగుంట సమీపంలో పట్టాలపై ఓ పెట్టె పడిపోయి ఉండటాన్ని గుర్తించిన మహిళ  పెట్టెను తెరిచేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ పెట్టె ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మహిళకు గాయాలయ్యాయి.

రైలు పట్టాలపై ఈ బాక్స్ ను ఎవరు పెట్టారనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.  రైల్వే ట్రాక్ కు కూడ  స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా  అధికారులు చెబుతున్నారు.ఈ పేలుడు సంభవించిన సమయంలో ఈ మార్గంలో ఎలాంటి రైళ్ల రాకపోకలు సాగలేదు. దీంతో  పెను ప్రమాదం తప్పిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. ఈ పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. 

గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత మహిళ కుడి చేయికి తీవ్రంగా గాయలయ్యాయి. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద  ఎత్తున శబ్దం విన్పించిందని స్థానికులు చెప్పారు. ఈ శబ్దం  విన్న స్థానికులు వచ్చి చూడడంతో మహిళ గాయపడి ఉంది. వెంటనే ఆమెకు అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన మహిళను శశికళగా గుర్తించారు. ఈ ప్రాంతంలో అడవి పందులను చంపేందుకు ఈ తరహా పేలుడు పదార్ధాలను ఉపయోగిస్తారని పోలీసులు చెప్పారు. అడవి పందుల కోసం తెచ్చిన పేలుడు పదార్ధాలా.. లేక ఇంకా దేని కోసం ఈ పేలుడు పదార్ధాలను తెచ్చారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శశికళ కుడి చేయి వేళ్లు తెగిపోయాయి. ఆమెకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని పోలీసులు కోరారు.