విజయవాడ: అత్యంత ప్రమాదకరమైన రీతిలో దోపిడీలకు పాల్పడుతూ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న బ్లేడ్ బ్యాచ్ ఆట కట్టించారు కృష్ణా జిల్లా పోలీసులు. ఏలూరు నుంచి బ్లేడ్ బ్యాచ్ వస్తున్నట్లు పక్కా సమాచారంతో అలెర్ట్ అయిన గన్నవరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన వారిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా బ్లేడ్లు, కొంత నగదు, డియో బైక్, 4కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గన్నవరం మండలం గూడవల్లి సమీపంలో రెండు రోజుల క్రితం ఓ లారీ డ్రైవర్ పై దాడికి పాల్పడింది ఈ బ్లేడ్ బ్యాచ్. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన లారీ డ్రైవర్ గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ఈ బ్యాచ్ ను అరెస్ట్ చేశారు. 

ప్రస్తుతం పట్టుబడిన వారందరూ విజయవాడ వన్ టౌన్ కు చెందినవారుగా గన్నవరం పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పై దాడి కేసుతో పాటు ఏవయినా ఇతర కేసుల్లో కూడా  వీరికి ప్రమేయముందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వీరిపై మాధకద్రవ్యాల కేసు కూడా నమోదు చేయనున్నట్లు గన్నవరం పోలీసులు తెలిపారు.