విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజల వ్యవహారాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అచ్చం అలాంటి సంఘటనే సింహాచలంలో చోటుచేసుకుంది. విశాఖలో పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో గురువారం రాత్రి క్షుద్రపూజలు నిర్వహించడం కలకలం రేగింది.ఉత్తరాంధ్ర స్థానిక పత్రిక ‘లీడర్’ కథనం ప్రకారం.. గురువారం ఆలయంలో పూజాలరులు క్షుద్రపూజలు నిర్వహించారు. 

ఆలయ పరిధిలోని భైరవకోనలోని భైరవస్వామి ఆలయంలో గురువారం రాత్రి రెండు గంటల పాటు పూజలు, హోమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి సింహాచలం దేవస్థానం కార్య నిర్వాహణాధికారి కె. రామచంద్ర మోహన్ గా పేర్కొంటున్నారు. ఆయన తన బంధువుల కోసం ఆలయంలో హోమాలు,పూజలు నిర్వహించారనే ఆరోపణలు వినపడుతున్నాయి.

ఈవో ఆదేశాలపై సింహాచలానికి చెందిన ఐదుగురు పండితులు భైరవస్వామి ఆలయానికి వచ్చి వింత పూజలు జరిపినట్లు సమాచారం. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులను లోపలికి రానీయకుండా,.. బయటనే ఉంచి తాళాలు వేసిమరీ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సాధారణంగా అమావాస్య వేళల్లో భైరవస్వామిని దర్శించుకోవడానిక భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. వారిని స్వామివారిని దర్శించుకోనివ్వకుండా ఇలా చేయడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భక్తులను లోపలికి రాకుండా అడ్డుకున్న సంయంలో కొంతసేపు తోపులాట, ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. అధికారులను నిలదీసిన భక్తులపై  ఆలయ సిబ్బంది దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వినపడుతున్నాయి. మరి ఈ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.