హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులనే కాకుండా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన నేతలకు బిజెపి గాలం వేస్తోంది. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడమే కాకుండా జనసేనకు చెందిన నాయకులను కూడా తీసుకుని ఎపిలో బిజెపి బలపడాలని చూస్తోంది. బలమైన ఇతర నాయకులను కూడా తన వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది.

తన వ్యూహంలో భాగంగా బిజెపి నేతలు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావుకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. నాదెండ్ల భాస్కర్ రావు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ మాత్రం జనసేనలో కొనసాగుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. 

నాదెండ్ల భాస్కర రావును తమ వైపు తిప్పుకోవడం ద్వారా నాదేండ్ల మనోహర్ ను తమ పార్టీలోకి ఆహ్వానించాలని బిజెపి నేతలు ఆలోచిస్తున్నారు. తద్వారా పవన్ కల్యాణ్ ను కూడా లక్ష్యం చేసుకోవాలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ పట్ల ఇప్పటికే బిజెపి నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. రాజకీయంగా స్థిరత్వం లేకపోవడం ఆయన ప్రధాన లోపంగా బిజెపి నేతలు భావిస్తున్నారు. 

నాదెండ్ల మనోహర్ ఒక రకంగా జనసేనలో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నారు. పవన్ కల్యాణ్ తర్వాతి స్థానం జనసేనలో నాదెండ్ల మనోహర్ దే అనే పరిస్థితి ఉంది. అయితే, భవిష్యత్తులో జనసేన ఏ మేరకు నిలదొక్కుకుంటుందనేది చెప్పలేని స్థితి. ఈ కారణంగా నాదెండ్ల మనోహర్ ను కూడా తమ వైపు తిప్పుకోవాలని బిజెపి నేతలు ఆలోచిస్తున్నారు.