కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తన ఆపరేషన్ ను మరింత ఉధృతం చేస్తోంది. తెలుగుదేశం పార్టీని బలహీనపరుస్తూ తాను బలం పుంజుకునే వ్యూహాన్ని రచించి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బిజెపి నేతలు మాజీ పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి గాలం వేస్తోంది. 

కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. టీడీపీ పూర్తిగా దెబ్బ తిన్నది. ఈ స్థితిలో బీజేపీ టీడీపీపై వల విసిరింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ పలువురు నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
 
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవడానికి రాం మాధవ్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యత్వం లేదా కేబినేట్‌ హోదా కలిగిన నామినేటెడ్‌ పదవిని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఎన్నికలకు ముందు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆయన సతీమణి టీడీపీలో చేరిన విషయం తెలిసింందే. కర్నూలు లోకసభ సీటుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యేగా ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ పోటీ చేసి ఓటమి పాలయ్యారు..
 
ఎన్నికల ముందే బీజేపీలో చేర్చు కోవడానికి ఆ పార్టీ నాయకులు పలుమార్లు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని సంప్రదించారు. అయితే ఆయన టీడీపీలోకి వెళ్లారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని తమ పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా బిజెపి నేతలు పావులు కదుపుతున్నారు.