గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల సమరానికి బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఇంటింటికి బీజేపీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ మరోనూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. 

ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ అన్ని జిల్లాల కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ పరిస్థితిపై నేతలు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో బస్సుయాత్రకు శ్రీకారం చుట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. 

బస్సుయాత్ర ద్వారా  బీజేపీ సత్తా ఏంటో చూపించాలని కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ బస్సుయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రారంభం కానున్న బస్సుయాత్ర  కర్నూలు జిల్లా ఆదోనిలో ముగియనుందని తెలిపారు. ఈ బస్సుయాత్ర నిర్వహణకు సంబంధించి బీజేపీ 8 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15రోజుల్లో 85 నియోజకవర్గాల మీదగా బస్సుయాత్ర కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. 

బస్సుయాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని, కేంద్రం సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని కమలనాథులు స్పష్టం చేశారు. బస్సుయాత్రలో భాగంగా జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కన్నా తెలిపారు. 

ప్రతి జిల్లాలో ఒక్కో కేంద్ర మంత్రులు పాల్గొనేలా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జులతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశమై దిశానిర్దేశం చేశారు.