2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో బిజెపి విజయం ఖాయమని... అధికారం కోత్పోతామని తెలిసే వైసిపి నాయకులు ఉలిక్కిపడుతున్నారని బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.  

అమరావతి: ఇటీవల ఏపీలో పర్యటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా (JP Nadda)పై, ఆయన చేసిన కామెంట్స్ పై మంత్రులతో సహా అధికార వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. వీరికి ఏపీ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి (vishnuvardhan reddy) తనదైన స్టైల్లో కౌంటరిచ్చారు. జేపి నడ్డాపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటని... ఆయన అడ్డు, పొడుగు గురించి మాట్లాడే స్థాయి మీది కాదంటూ వైసిపి నాయకులపై విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. 

''ఇటీవల జెపి నడ్డా పర్యటన తర్వాత వైసిపి నిజస్వరూపం బయటపడింది. వైసీపీ మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో రాష్ట్ర ప్రజలకు అర్ధమైంది. ఏపీలో ఇసుక, భూ, మధ్యం, మైనింగ్ మాఫియా జరుగుతుందన్న నడ్డా ఆరోపణలు నిజం కాదా? దేశంలోనే మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ కాదా?'' అంటూ విష్ణువర్ధన్ నిలదీసారు. 

''వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఏపీ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకొని లబ్ధిదారులకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. జగన్ అన్న కాలనీలో ఎక్కడ ఇండ్లు కట్టారో వైసీపీ నేతలు చెప్పాలి. కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు... మరి ఎయిమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది. ఐఐటీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్, జాతీయ రహదారులు కేంద్రం ఇవ్వలేదా. ఏపీలో జాతీయ రహదారులు తప్పితే రాష్ట్ర రహదారులు వున్నాయా'' అంటూ ప్రశ్నించారు. 

''దేశంలో రెండే మతతత్వ పార్టీలు ఉన్నాయి... ఒకటి మజ్లీస్, రెండోది వైసీపీ. దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని చర్చి పాస్టర్లకు జీతాలు ఇస్తున్న మీరు మతతత్వం గురించి మాట్లాడతారా? బిజెపి ముందు మీ బలం ఎంత?'' అంటూ మండిపడ్డారు. 

''వైసీపీ ప్రభుత్వ పాలనలో అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? ఏకంగా మంత్రుల ఇల్లు తగులబెడుతుంటే అడ్డుకోలేకపోయిన మీర ప్రజలను ఏ విధంగా కాపాడుతారు. కోనసీమలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాలకు వైసీపీ పాల్పడుతుంది'' అని విష్ణువర్ధన్ ఆరోపించారు. 

''బియ్యం పంపిణీ చేసిన వాహనాల్లో మృతదేహాలను సరఫరా చేస్తున్నారు. ఎమ్మెల్సీ మర్డర్ చేసి జైలుకెళితే రాచ మర్యాదలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. గంజాయి ఎక్కడ దొరికినా ఏపీతో ముడిపడి ఉంటోంది'' అని ఆరోపించారు. 

''ఆర్ధిక క్రమ శిక్షణ ఏపీ ప్రభుత్వానికి లేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అధికారంలో ఉండే అర్హత వైసీపీ ప్రభుత్వం కోల్పోయింది. వైసీపీ ప్రభుత్వానిది అవినీతి ఎజెండా.. బిజెపి ది అభివృద్ధి అజెండా. అందుకే బిజెపిని రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారు. 2024అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుంది'' అని విష్ణువర్ధన్ ధీమా వ్యక్తం చేసారు. 

''మూడు నెలలకు ఒకసారి ప్రధానిని కలుస్తున్న జగన్ ఎందుకు ప్రత్యేక హోదా గురించి అడగడం లేదు. ఆంధ్రా, తెలంగాణ నిధుల పంచాయతీ వచ్చే సరికి బిజెపి ను నిందిస్తున్నారు. మరి దావోస్ లో అన్నదమ్ముల మాదిరిగా జగన్, కేటీఆర్ ఆలింగనం చేసుకున్నప్పుడు ఎక్కడికి పోయింది ఈ పంచాయతీ'' అని విష్ణువర్ధన్ నిలదీసారు.