అమరావతి: శాసనమండలిలో ప్రత్యేక హోదా అంశం చిచ్చు రాజేసింది. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు మాటల యుద్ధానికి దిగారు. ఒక పార్టీ ఎమ్మెల్సీలపై మరో పార్టీ ఎమ్మెల్సీలు నిప్పులు చెరిగారు. దీంతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. 

సీఎం చంద్రబాబు నాయుడు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అభ్యంతరం తెలిపారు. అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. 

దీంతో బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ లు శాసనమండలి చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నిరసన తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీలను టీడీపీ ఎమ్మెల్సీలు చుట్టుముట్టి నిరసనలు తెలిపారు. దీంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ రంగంలోకి దిగి ఇరువురు సభ్యులకు సర్దిచెప్పారు. దీంతో పరిస్తితి కాస్త సద్దుమణిగింది.