అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే వూహరచనలో భాగంగానే బిజెపి తెలుగుదేశం పార్టీ నేతలకు వల వేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తీసుకోవద్దని బిజెపి నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు షరతు పెట్టినట్లు చెబుతున్నారు. దాంతో జగన్ వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. 

కార్యకర్తల బలం లేని బిజెపిలో చేరే కన్నా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం మంచిదని కొంత మంది తెలుగుదేశం నాయకులు భావించినట్లు చెబుతున్నారు. అయితే, అందుకు జగన్ సానుకూలంగా లేకపోవడంతో వారు వెనక్కి తగ్గి బిజెపి వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. 

తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బిజెపిలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, సిఎం రమేష్ లతో పాటు టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు బిజెపిలో చేరారు. కనకమేడల, సీతారామలక్ష్మి మాత్రం బిజెపిలో చేరడానికి ఇష్టపడలేదు. బిజెపి అగ్రనేతలు సంప్రదించినప్పటికీ వారు కాదన్నట్లు చెబుతున్నారు.

బిజెపిలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు లోకసభ సభ్యులకు కూడా బిజెపి గాలం వేసినట్లు చెబుతున్నారు. అయితే, వారు ముగ్గురు ఆగిపోయారు. ఐరోపా పర్యటనలో ఉన్న చంద్రబాబు వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. దాంతో ముగ్గురు లోకసభ సభ్యులు బిజెపిలో చేరకుండా ఆగిపోయినట్లు తెలుస్తోంది. 

అయితే, తొలుత బిజెపిలో చేరడానికి టీజీ వెంకటేష్ ఇష్టపడలేదని అంటున్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లాలని అనుకున్నారు. అయితే, జగన్ కు బిజెపి పెట్టిన షరతు తెలియడంతో చివరి నిమిషంలో బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు సమాచారం. 

బిజెపితో సఖ్యతను కోరుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతల మాటలను కాదనే పరిస్థితిలో లేరని అంటున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపించే పరిస్థితి ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం నాయకులను పార్టీలోకి రప్పించే బాధ్యతను కూడా బిజెపి నేతలు తమ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది.