భాజపా ఫైర్ బ్రాండ్ సోమువీర్రాజు రెచ్చిపోతున్నారు. చంద్రబాబునాయుడు ఈ ఎంఎల్సీ నేత తన జోరును మరింత పెంచారు. శనివారం మీడియాతో మాట్లాడిన వీర్రాజు అభివృద్ధిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునివ్వటం సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు చేసిందేమీ లేదని చేసిన వ్యాఖ్యలు టిడిపి విషయంలో భాజపా వైఖరి ఏంటో చెప్పకనే చెబుతోంది. ప్రభుత్వాన్ని నిలదీయండి, రాయలసీమను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అంటూ ఇప్పటి వరకూ ప్రతిపక్ష వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే విమర్శించేవారు. తాజాగా భాజపా నేత కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు.

రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వాన్ని నేతలు నిలదీయాలని చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే, మూడున్నరేళ్ళల్లో రాయలసీమకు టిడిపి చేసిందేమీ లేదంటే అందులో మిత్రపక్షంగా భాజపాకు కూడా బాధ్యతుంది. ‘రాయలసీమ ఇప్పటికీ వెనుకబడే ఉందని, తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాల’ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని వీర్రాజు అన్నారు. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీని కేంద్రం ఏర్పాటు చేస్తుందని, ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.

సరే, వీర్రాజు ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా ఆయన రోజురోజుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందులోనూ చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుంటున్న విషయాన్న కాస్త ఆలోచించాల్సిందే. వీర్రాజు మాటలు చూస్తుంటే తెలుగుదేశంపార్టీకి భాజపా మిత్రపక్షమా లేక ప్రతిపక్షమా అన్న అనుమానాలు మొదలయ్యాయి. బహుశా త్వరలో ప్రతిపక్షంగా మారే అవకాశాలున్నాయి కాబట్టే ఇప్పటి నుండే వీర్రాజు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నట్లు భాజపాలోని పలువురు నేతలు అనుమానిస్తున్నారు.