కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఆనందించదగ్గ విషయమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ కో ఇన్ చార్జ్ సునీల్ దేవధర్. గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు గొప్ప మార్పు కోరుకున్నారని అభిప్రాయపడ్డారు. 

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం రెడ్డివారి పల్లెలో ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టబోయే కార్యక్రమాల విషయంలో రాష్ట్రప్రభుత్వానికి ప్రధాని నరేంద్రమోదీ మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25 లక్షల మందిని బీజేపీలో చేర్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు.  

ఇకపోతే మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సునీల్ దేవధర్. చంద్రబాబు నాయుడు జీవితంలో మళ్లీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. తమ పార్టీ భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు లేరన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు కోట్లాది రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ చివరకు తన కొడుకు లోకేష్ కు మాత్రం చంద్రబాబు జాబు ఇప్పించుకుని నిరుద్యోగులను నట్టేట ముంచారని విమర్శించారు.  

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఖతమ్ అయిపోయిందనని చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రతిపక్ష పాత్ర తామే పోషిస్తామన్నారు. చంద్రబాబు అవినీతి కేసులను వెలికితీయడంలో జగన్ కాస్తంత నిబద్దతతోనే వ్యవహరిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ రిపోర్ట్ ఆధారంగానే నేరస్థులను శిక్షిస్తాం అంటూ సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు.  

తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు  బీజేపీ జాతీయకార్యదర్శి సునీల్ దేవధర్. చంద్రబాబును జైలుకు పంపిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే తరుణంలో జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఏపీకి చెందిన బీజేపీ కేడర్ మాత్రం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మినహా బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, విష్ణువర్థన్ రెడ్డిలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. జగన్ పాలనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి తరుణంలో సునీల్ దేవధర్ జగన్ ను పొగుడ్తూ చేస్తున్న వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీనే కాదు యావత్ బీజేపీ నేతలను కూడా విస్మయానికి గురి చేస్తోంది.