చంద్రబాబునాయుడును మిత్రపక్షం బిజెపినే ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. బడ్జెట్ నేపధ్యంలో బిజెపిపై ఒత్తిడి తెచ్చి ఏదో సాదిద్దామనుకున్న చంద్రబాబుకు సీన్ రివర్స్ అవుతోంది. ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బనే తట్టుకోలేకపోతున్న చంద్రబాబుపై బిజెపి నేతలు పెద్ద బాంబు పేల్చారు. దాంతో సమస్యల్లో నుండి ఎలా బయటపడాలో చంద్రబాబుకు దిక్కు తోచటం లేదు.

మూడున్నర చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై తమ వద్ద పూర్తి ఆధారాలున్నట్లు బిజెపి చేసిన ప్రకటనతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది. బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ, టిడిపి అవినీతికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలున్నట్లు ప్రకటించారు. ఏ పథకంలో ఎంత అవినీతి జరిగింది? ఏ ప్రాజెక్టుల్లో ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారన్న విషయంపై పూర్తి ఆధారాలున్నాయని స్పష్టంగా చెప్పారు.

అంతేకాకుండా వైసిపి ఎంఎల్ఏల కొనుగోళ్ళపై కూడా తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ఏ ఎంఎల్ఏకి ఎంతెంత డబ్బులు ముట్ట చెప్పారనే విషయాలకు ఆధారాలున్నట్లు చెప్పటంతో టిడిపిలో ఆందోళన పెరిగిపోతోంది. టిడిపి అవినీతిని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా ప్రస్తావిస్తామంటూ విష్ణు చేసిన ప్రకటన ఒక విధంగా టిడిపిలో కలకలం రేపుతోంది.

అదే సమయంలో టిడిపితో పొత్తు అవసరమే లేదంటూ బిజెపి నేతలు కుండబద్దలు కొట్టటం గమనార్హం. తమ మంత్రులు త్వరలో రాజీనామా చేస్తారంటూ బిజెపి నేతలు చేసిన ప్రకటనతో చంద్రబాబు ఒక విధంగా ఆత్మరక్షణలో పడ్డారనే చెప్పాలి. కేంద్రప్రభుత్వంలో నుండి టిడిపి మంత్రులు బయటకు వచ్చేయాలంటూ ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. రాజీనామాలకు సిద్దమంటూ ప్రకటనలు చేస్తున్నారే కానీ కేంద్రమంత్రులు, ఎంపిలు రాజీనామాలు మాత్రం చేయటం లేదు. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేస్తే తర్వాత ఏం జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు.

అదే సమయంలో రాష్ట్రంలోని బిజెపి ఇద్దరు మంత్రుల్లో మాణిక్యాలరావు తన రాజీనామాను ప్రకటించారు. ఈయన కూడా పార్టీ ఆదేశిస్తే 5 నిముషాల్లో రాజీనామా చేస్తానంటూ చేసిన ప్రకటనతో గందరగోళం మొదలైంది. చివరకు కేంద్రం బడ్జెట్ తో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవనే అనిపిస్తోంది.