పెదకాకాని శివాలయంలో మాంసాహరం కలకలం.. బీజేపీ ఆందోళన , చర్యలకు డిమాండ్

గుంటూరు జిల్లా పెదకాకానిలో ప్రసిద్ధ భ్రమరాంభ మల్లేశ్వరస్వామి దేవాలయం క్యాంటీన్‌లో మాంసాహారం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై బీజేపీ భగ్గుమంది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాషాయ శ్రేణులు ఆందోళనకు దిగారు. 
 

bjp protest on Non Veg Cooking in Sri Bhramaramba Malleswara Swamy Temple Pedakakani

గుంటూరు జిల్లా (guntur district) పెదకాకానిలోని భ్రమరాంభ మల్లేశ్వరస్వామి (Pedakakani Sri Bhramaramba Malleswara Swamy Temple) ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ క్యాంటీన్‌లో నిర్వహకులు మాంసాహారం (non veg food) వండటం కలకల రేపింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఈ క్యాంటిన్‎లో అల్పాహారం, అన్నదానం చేస్తుంటారు. అయితే అదే క్యాంటీన్‎లో మాంసాహారం వండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరుల పేరుతో క్యాంటీన్ దక్కించుకున్న వైసీపీ నేత షరీఫ్.. ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండి బయట ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. భక్తులు గుర్తించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

మరోవైపు ఈ ఘటనపై హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు ఆందోళనకు దిగారు. ఈవో కార్యాలయం వద్ద హిందూ సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఆలయ పవిత్రను దెబ్బతీసే కార్యకలాపాలు సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్‌ టెండర్ల దశ నుంచే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండిన ఘటనలో బాధ్యులపై  కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా బీజేపీ (bjp) అధ్యక్షుడి దృష్టికి ఈ విషయం వెళ్లడంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు దేవస్థానం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్ ఇచ్చిన ఈవోని తక్షణం సస్పెండ్ చేయాలని, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని ఆందోళన నిర్వహించారు. 

అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో దేవాదాయ శాఖ అధికారులు (ap endowments) చర్యలు చేపట్టారు. క్యాంటీన్‌ను మూసివేశారు. ఆలయ క్యాంటీన్‌ను సీజ్‌ చేశామని..  నిర్వాహకుల లైసెన్స్‌ను రద్దు చేశామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మాంసాహారాన్ని బయటే వండినట్లు.. దానికి సంబంధించిన వాహనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చినట్లు నిర్వాహకులు చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై నిన్ననే నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసు జారీ చేశామని... దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమీషనర్ చెప్పారు. నిర్వాహకుల వివరణ రాగానే తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఇతర మతస్థులు క్యాంటీన్‌ నిర్వహణ చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని.. చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios