విజయవాడ: చంద్రబాబుకు పట్టిన గతే  ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు పడుతుందని హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గతంలో చంద్రబాబునాయుడు ఏ రకంగా  ఒకే కులానికి ప్రాధాన్యతఇచ్చారో... జగన్‌ కూడ అదే రకంగా వ్యవహరించారన్నారని ఆరోపించారు.

ఆదివారం నాడు గుంటూరులో  జరిగిన పార్టీ పదాధికారుల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.  ఏపీలో 2014లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందన్నారు.  తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో  కూడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కానుందన్నారు.

పరుగు పందెంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ మధ్యలోనే పారిపోయారని  ఆయన విమర్శించారు. ఏపీలో బీజేపీ ఎవరితో పొత్తు కోరుకోదన్నారు. ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేపట్టనున్నట్టుగా ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

దేశమంతా తిరిగిన చంద్రబాబుకు రాష్ట్రంలో  దిక్కు లేకుండా పోయిందన్నారు.తన కొడుకును సీఎం చేయడానికి  చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. ఏపీలో కాంగ్రెస్‌తో పాటు టీడీపీకి కూడ భవిష్యత్తు లేదన్నారు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.