రాజమహేంద్రవరం: ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు ఉన్నా బీజేపీ ఒంటిరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన సునీల్ ధియోధర్ భవిష్యత్‌లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. సొంతంగానే పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 8 లక్షలమంది బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో దాన్ని 25 లక్షలకు పెంచుకుంటామని సునీల్ ధియోధర్ ధీమా వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపైనా చంద్రబాబు నాయుడుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో మరిన్ని వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా చూడాలనుకునేవారు ఖచ్చితంగా బీజేపీలో చేరతారని చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీతో తాము పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. తెలుగుదేశం పార్టీకి డోర్స్ క్లోజ్ చేసినట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అని ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనని విమర్శించారు. 

రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరతారని స్పష్టం చేశారు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు ఉండదని, శాశ్వతంగా డోర్స్ క్లోజ్ చేసినట్లు పార్టీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా స్పష్టం చేసినట్లు సునీల్ ధియోధర్ తెలిపారు. 

ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు సునీల్ ధియోధర్. ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉందని విమర్శించారు. వైసీపీ ఏదో ఉద్దరిస్తుందని ఆశించి భంగపడ్డారన్నారు. 

బీజేపీ అంటే భారతీయ ప్రజాస్వామ్య పార్టీ అని, ప్రజలు తమ పార్టీనే బలంగా కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కుటుంబ వారసత్వ పార్టీలను ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించారని చెప్పుకొచ్చారు. 

పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై బీజేపీ బృందం ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. నివేదిక సైతం రూపొందిచినట్లు చెప్పుకొచ్చారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ప్రాజెక్టు పరిస్థితిపై చర్చిస్తామన్నారు.