కర్నూల్: కేసీఆర్ ను పిలిచి జగన్ దావత్ ఇవ్వాలి... అప్పుడైనా కేసీఆర్ మనసు మారుతుందేమోనని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. మిగులు జలాలను తెలంగాణ వాడుకోవచ్చు... రాయలసీమ వాడుకోవద్దా అని ఆయన ప్రశ్నించారు.మూడు రాజధానులు ఇప్పట్లో జరిగే అంశం కాదన్నారు. ఏపీ ఆర్ధిక సంక్షోభంలో ఉందనేది జగమెరిగిన సత్యమన్నారు.

కేంద్రం తెస్తున్న బిల్లులకు జగన్ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తున్నా కొందరు నేతలు నోరు జారుతున్నారని టీజీ వెంకటేష్ మండిపడ్డారు.

ప్రత్యేక హోదాను ఇంకా బూచిలా చూపుతున్నారన్నారు. హోదా కూడ జరిగే పని కాదన్నారు. కేంద్రం నుండి కనీసం ప్యాకేజీ తీసుకొని రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై  రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి.ఈ నెల  మొదటి వారంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలు తమ వాదనలను విన్పించాయి. రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణంలో చర్చలు జరిగినట్టుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ప్రకటించిన విషయం తెలిసిందే.