రాయలసీమలో రాజధాని ఉండాలనేది ఈ ప్రాంత ప్రజల 80 ఏళ్ల కల అన్నారు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్. కర్నూలులో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్నూలులో స్టేట్ కోవిడ్ ఆసుపత్రి చేయడం ద్వారా కరోనా క్యాపిటల్‌గా చేశారని ఎద్దేవా చేశారు.

కోవిడ్‌తో నగర వాసులు ప్రజలు భయపడుతున్నారని ఆయన వాపోయారు. గ్రామాల్లో సచివాలయాలతో వికేంద్రీకరణ  చేసినట్లుగా ప్రాంతీయ కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని వెంకటేశ్ డిమాండ్ చేశారు.

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి డిసెంబర్ 2020 దాకా సమయం పట్టే అవకాశం వుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి, అది సెట్ట అవ్వడానికి వచ్చే 2021 డిసెంబర్ కావొచ్చని టీజీ అన్నారు.

అప్పటి వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. అప్రమత్తంగా ఉండాల్సిన  అవసరం ఎంతైనా ఉందన్నారు. వీలైనంత త్వరగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి కంటే కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యులు, సౌకర్యాలు ఉన్నాయన్నారు. అయితే కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు మరింత మెరుగు పరచాలని టీజీ డిమాండ్ చేశారు. బీజేపీ రాయలసీమ అభివృద్ధి డిక్లరేషన్‌లో భాగంగా హైకోర్టు ఏర్పాటు నిర్ణయం సంతోషమన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో మినీ సెక్రటేరియట్, శీతాకాల సమావేశాలు నిర్వహించాలని వెంకటేశ్ డిమాండ్ చేశారు. అధిష్టానం అనుమతితో రాయలసీమలో మినీ సెక్రటేరియట్, శీతాకాల సమావేశాల కోసం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.