కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వైసీపీ నేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. వైసీపీ ప్రభుత్వంలో ఎవరు జేబులు నింపుకుంటున్నారో ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వైసీపీ నేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గురువారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అవినీతిని ప్రజలే నిరూపిస్తారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువగానే నిధులు ఇచ్చామని లక్ష్మణ్ తెలిపారు. ప్రత్యేక హోదాకు మించిన నిధులు ఏపీకి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి ఎవరితోనూ పొత్తులు వుండవని సొంతంగానే పోటీ చేస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరు జేబులు నింపుకుంటున్నారో ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు.
మోడీ కంటే ఎక్కువ అభివృద్ధ, సంక్షేమం చేసినట్లు నిరూపిస్తారా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రగతి నివేదికను నిజాయితీగా ప్రజల ముందు వుంచుతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్ధికంగా అతలాకుతలం అవుతుంటే మోడీ ముందుచూపు వల్లే భారత్ గట్టెక్కిందని లక్ష్మణ్ వెల్లడించారు. భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2గా వుందని.. ప్రపంచం ఆర్ధిక ఇబ్బందులు పడుతోందని, కొన్ని దేశాల్లో ఆహార కొరత వుందని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని లక్ష్మణ్ ఆకాంక్షించారు.
ALso Read: జగన్‌పై వ్యాఖ్యలు.. డ్యాన్స్‌లు వేసుకునే వ్యక్తి సీఎంగా అవసరమా : పవన్‌కు బొత్స కౌంటర్
అంతకుముందు ఏపీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించారు. హక్కుగా రావాల్సిన నిధులు తప్ప ఏపీకి కేంద్రం రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ అంటే అమిత్ షాకు , బీజేపీకి తెలుసా అని ఆయన నిలదీశారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, అమిత్ షా వ్యాఖ్యలు అలాగే వున్నాయని బొత్స చురకలంటించారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను అడిగితే తెలుస్తుందని ఆయన హితవు పలికారు. విశాఖ ఉక్కును అమ్మేస్తూ కొత్త డ్రామాకు తెరదీస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.
