Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఆరాటం 'లోక' కల్యాణం కోసం కాదు 'లోకేశ్' కల్యాణార్థం: అయ్యన్నపై జీవీఎల్ సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ ఆ పార్టీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు ఆరాటం 'లోక' కల్యాణం కోసం కాదు 'లోకేశ్' కల్యాణార్థమంటూ ట్వీట్ చేశారు. 

bjp mp gvl narasimharao satires on tdp chief chandrababu naidu and nara lokesh
Author
First Published Nov 20, 2022, 4:55 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇటీవల టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రావణుడిని వధించే సత్తా శ్రీరాముడికి వుందని, కానీ నాడు లోక కళ్యాణం కోసం శ్రీరాముడు అందరి సాయం కోరాడని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా రాష్ట్ర కళ్యాణం కోసం అలాంటి నిర్ణయమే తీసుకోవాలంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు. దీనిపైనే జీవీఎల్ పంచులు వేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. 

"భగవంతుడైన శ్రీరాముడితో తమ నాయకుడిని పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతరపార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం "లోక"కల్యాణం కోసం కాదు. "లోకేశ్‌"కల్యాణార్థం అని అందరికీ తెలుసు" అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అంతకుముందు గత శుక్రవారం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాపోరు సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ప్రజలకు వివరించామన్నారు. వైసిపి వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ కార్యాచరణ సిద్దం చేశామని.. ఎక్కడిక్కడ పోరాటాలు చేసి ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామని జీవీఎల్ హెచ్చరించారు. రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని... గన్నవరం విమానాశ్రయంలో స్థానిక పోలీసులతో రక్షణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

టిడిపి, వైసిపి ప్రభుత్వం హయాంలో అనేక ఆరోపణలు వచ్చాయని.. కేంద్ర విమానయానశాఖ మంత్రికి లేఖ రాశానని జీవీఎల్ తెలిపారు. సీఐఎస్ఎఫ్ బలగాలు ఎయిర్‌పోర్ట్‌లో ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు వేల నోట్లు ఎందుకు కనిపించకుండా పోయాయని జీవీఎల్ ప్రశ్నించారు. ఆర్.బి.ఐ ద్వారా విచారణ చేయాలని కోరతామని... జగన్ ప్రభుత్వం వైఫల్యంపై ఛార్జిషీట్ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. టిడిపికి సొంత ప్రయోనాలే తప్ప .. ప్రజల‌ ప్రయోజనాలు పట్టవన్నారు. మోడీ విశాఖ పర్యటన తరువాత ప్రజల్లో మార్పు కనిపిస్తోందని జీవీఎల్ పేర్కొన్నారు. మా మిత్ర పక్షం.. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ ద్వారా ఇదే చెప్పారని ఆయన గుర్తుచేశారు. 

2024లో ఎపిలో మోడీ మ్యాజిక్ పని చేస్తుందని.. బిజెపి, జనసేన భాగస్వామ్యంతో అధికారంలోకి వస్తామని జీవీఎల్ పేర్కొన్నారు. పొలిటికల్ బ్లాక్ బస్టర్ 2024లో రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టిడిపి పూర్తి అభద్రతా భావంతో ఉందని.. వారిలో నాయకత్వం క్షీణిస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారని జీవీఎల్ చెప్పారు. వైసిపి, టిడిపిలు రెండూ కుటుంబ పార్టీలు,కుట్ర పార్టీలని ఆయన ఎద్దేవా చేశారు. నిజమైన ప్రత్యామ్నాయం ఒక్క బిజెపితోనే సాధ్యమని.. రాష్ట్రంలో కాపులకు, బిసిలకు, ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరగడం లేదని జీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అన్ని వర్గాల వారికి న్యాయం చేయడం బిజెపి, జనసేన కూటమికే సాధ్యమన్న ఆయన.. వారికి సముచిత స్థానం కల్పించే కార్యాచరణ సిద్దంగా వుందన్నారు. యనమల వంటి వారికే సీటు లేదని చంద్రబాబు అంటున్నారని.. వైసిపిలో కేవలం ఒక వర్గానికే పదవులు దక్కుతున్నాయని నరసింహారావు ఎద్దేవా చేశారు. వైసిపి కాదు... బిజెపి, జనసేన తోనే రాష్ట్రానికి భవిష్యత్తు వుంటుందన్నారు. అన్నమయ్య బ్యారేజి కొట్టుకుపోయి యేడాది అయినా జగన్‌లో స్పందన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ వాళ్లు ముందుగా వెళ్లి సహాయక చర్యలు చేపట్టారని... కానీ రాజకీయ పర్యటనగానే జగన్ వెళ్లి వచ్చారని జీవీఎల్ దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది.. ఏ సాయం అందించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios