నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికలో పోటీకి సంబంధించి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో కలిసే అక్కడ పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ, టీడీపీలతో బీజేపీకి పొత్తు ఉండదన్నారు
ఏపీలో వైసీపీకి (ysrcp) బీజేపీనే (bjp) ప్రత్యామ్నాయం అన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (gvl narasimha rao) . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు కోసం ఏపీలోని ప్రధాన పార్టీలు యత్నిస్తున్నాయని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమన్న జీవీఎల్... ఏపీలో వైసీపీ, టీడీపీలతో బీజేపీకి పొత్తు ఉండదన్నారు.
ఈ సందర్భంగా బీజేపీతో సంబంధాల కోసం వైసీపీ, టీడీపీ చేస్తున్న యత్నాలపై జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తమకు సత్సంబంధాలున్నాయని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఫైరయ్యారు. రాజ్యాంగ బాధ్యతల్లో భాగంగానే వైసీపీ నేతలతో మోడీ (narendra modi) కలుస్తున్నారని జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (chandrababu naidu) సైతం బీజేపీతో పొత్తు అంటూ డ్రామాలాడుతున్నారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read:atmakur bypoll: ఆత్మకూరు ఉపఎన్నిక.. షెడ్యూల్ విడుదల, జూన్ 23న పోలింగ్
ఇకపోతే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికకు (atmakur bypoll) సంబంధించి ఎన్నికల సంఘం (election commission) షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 23న పోలింగ్ జరగనుండగా.. 26న ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ తెలిపింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (mekapati Goutham reddy ) మృతితో ఆత్మకూరు స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
మరోవైపు ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి (mekapati vikram reddy ) పేరును ప్రకటించాలని మేకపాటి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ సీటును గౌతమ్ రెడ్డి భార్యకు కాకుండా ఆయన సోదరుడికి అవకాశం ఇద్దామని మేకపాటి కుటుంబం ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మేకపాటి ప్రతిపాదనకు సీఎం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
విక్రమ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు కుటుంబ సభ్యులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. అనంతరం ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా అంతా భావిస్తున్నారు.
