Asianet News TeluguAsianet News Telugu

మెజార్టీ ఉన్నా కాంగ్రెస్‌ ఆర్టికల్ 370ని పట్టించుకోలేదు: జీవీఎల్

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని జీవీఎల్ గుర్తు చేశారు. గతంలో పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి మెజార్టీ ఉన్నా.. జమ్మూకాశ్మీర్‌లో 370 అధికరణను తొలగించలేదని ఆయన మండిపడ్డారు

bjp mp gvl narasimharao comments on article 370
Author
Vijayawada, First Published Aug 8, 2019, 6:04 PM IST

కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంఎన్‌సీ బిల్లు అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించారు.

కొంతమంది దీనిపై అపోహలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని జీవీఎల్ గుర్తు చేశారు. గతంలో పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి మెజార్టీ ఉన్నా.. జమ్మూకాశ్మీర్‌లో 370 అధికరణను తొలగించలేదని ఆయన మండిపడ్డారు.

మోడీ సర్కార్ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని... బీజేపీ అనుకూల పార్టీలతో పాటు వ్యతిరేక పార్టీలు కూడా ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు మద్ధతు తెలపడం దేశ సమగ్రతకు నిదర్శనమన్నారు.

కేంద్రం చేసిన ఎన్నో మంచి పనులను తెలుగుదేశం పార్టీ అడ్డుకున్నందువల్లే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. జగన్ పాలనపై ఆరు నెలల తర్వాత స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వానికైనా కొంత వ్యవధి ఇవ్వాలని .. ఆ తర్వాత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం మంచిదని  నరసింహారావు అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios