విశాఖపట్నంలోని రుషికొండ వద్ద తవ్వకాల పనులు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రుషికొండలో ఉన్న రహస్యం ఏమిటని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖలోని (visakhapatnam) రుషికొండ (rushikonda) వద్ద మైనింగ్ పనులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (gvl narasimharao) తీవ్ర విమర్శలు గుప్పించారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్లకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రుషికొండలో ఉన్న రహస్యం ఏమిటని జీవీఎల్ ప్రశ్నించారు. కొండపై ఉన్న పాత హోటల్ పరిధి ఎంత ఉందో అంత మేరకే నిర్మాణం చేయాలని కోర్టులు కూడా స్పష్టం చేశాయని నరసింహారావు పేర్కొన్నారు. కొండ మొత్తాన్ని తొలిచినట్టున్నారని... అందుకే అక్కడకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. రుషికొండ తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని జీవీఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా.. విశాఖపట్టణంలోని రుషికొండలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని సుప్రీంకోర్టు (supreme court)ఈ నెల 1న ఆదేశించిన సంగతి తెలిసిందే. కొత్తగా తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ మే 6న ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌జీటీ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఈ విషయమై సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ , జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసం విచారణ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు విన్పించారు.
Also Read:జనసేనతో చర్చించే ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: ఎంపీ జీవీఎల్ నర్సింహారావు
రుషికొండలో ఆరు ఎకరాలు ఉండగా 8.2 ఎకరాల్లోనే నిర్మాణాలున్న విషయాన్ని సింఘ్వి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో రిసార్ట్స్ ఉన్న ప్రాంతంతో పాటు మరింత విస్తరిస్తామన్నారు. రుషికొండ విస్తరణ విషయమై సింఘ్వితో సుప్రీంకోర్టు ధర్మాసనం విబేధించింది. గతంలో రిసార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే నిర్మాణాలు చేయాలని ఆదేశించింది.
