Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్.. ఏం చెప్పారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ చేసిన కామెంట్స్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. 

BJP MP GVL Narasimha rao Says We welcome pawan Kalyan Comments
Author
First Published Nov 27, 2022, 2:16 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ చేసిన కామెంట్స్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కుటుంబ, వంశ రాజకీయాలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. పథకాల పేర్లను సొంత డబ్బా కోసం ‘‘జగనన్న’’ పేరుతో ప్రచారం చేసుకోవటం తప్పని విమర్శించారు. ఈ తప్పుడు సంస్కృతిని అవలంబించే వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయమయిన బీజేపీ-జనసేన నుంచే విముక్తి సాధ్యమని అన్నారు. 

ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార వైసీపీపై నిప్పులు చెలరేరిగారు. తాను వైసీపీ నాయకుల మాదిరిగా ఢిల్లీ వెళ్లి చాడీలు చెప్పనని అన్నారు. వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధాని మోదీకి చెప్పిచేయనని.. తానే చేస్తానని అన్నారు. తాను ఆంధ్రలో పుట్టానని.. ఆంధ్రలోనే తేల్చుకుంటానని చెప్పారు. తన యుద్దం తానే చేస్తానని అన్నారు. మాట్లాడితే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయనని అన్నారు. 

also read:2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా, మాది విప్లవసేన: ఇప్పటం గ్రామస్తులకు పవన్ ఆర్ధిక సహాయం

151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది  ఎంపీలున్నా  వైసీపీ  నేతలు  తనపై  ఎందుకు ఏడుస్తున్నారో  చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ  నేతలు  మర్యాదగా ప్రవర్తిస్తే తాము  కూడా  పద్దతిగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వైసీపీ నేతలు నీచంగా  వ్యవహరిస్తే తాము  విప్లవకారులుగా  మారుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో175  సీట్లు  వైసీపీకి  రావాలంట.. అయితే తాము ఏం చేయకుండా 175 వాళ్లకు అప్పగించాలా? అని ప్రశ్నించారు. 175  సీట్లు  వైసీపీకి వస్తుంటే తాము నోట్లో వేళ్లు పెట్టుకుని చూస్తామా అంటూ మండిపడ్డారు.

గత ఎన్నికల్లో తనను  ఇష్టపడిన  అభిమానులు కూడా  వైసీపీకి  ఓటేశారన్నారు. అందుకే  వైసీపీకి 151  సీట్లు వచ్చాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో  వైసీపీని  గెలిపిస్తే  రాష్ట్రంలో  కూల్చని మిగిలిన ఇళ్లను కూల్చివేస్తారని పవన్  కళ్యాణ్  విమర్శించారు. వైసీపీ నేతలు  తమ  భవిష్యత్తు  కోసం  30  ఏళ్లు  పాలన  కోరుకుంటున్నారన్నారనీ.. కానీ తాను  ప్రజలు  30  ఏళ్ల పాటు  బాగుపడాలని  కోరుకుంటున్నట్టుగా  జనసేనాని  చెప్పారు. 

తమను రౌడీసేన అని వైసీపీ నేతలు  చేస్తున్న విమర్శలకు పవన్  కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తమది రౌడీసేన కాదు విప్లవ సేన అని  చెప్పారు. వైసీపీ మాదిరిగా  దౌర్జన్యాలు చేసేవారికి తాము  రౌడీలుగా  కన్పిస్తుండొచ్చన్నారు. కానీ  ప్రజల  దృష్టిలో  తాము  విప్లవకారులని ఆయన  చెప్పారు. వీధీ రౌడీలతో  ఎలా ప్రవర్తించారో  తమకు  తెలుసునని అన్నారు. వైసీపీ పార్టీనా?, టెర్రరిస్టు సంస్థా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.  అనంతపురంలో జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్శంగా  పవన్  కళ్యాణ్ ప్రస్తావించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios