ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం మీదుగా కోడికొండ చెక్‌పోస్ట్ నుండి మడకసిర వరకు ప్రభుత్వం నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది.

అయితే రోడ్డు నిర్మాణం కోసం లేపాక్షి గ్రామంలోని ప్రపంచ సాంస్కృతిక విలువ కలిగిన రక్షిత స్మారక కట్టడాలకు తీవ్ర హాని కలిగించడం సరి కాదని జీవిఎల్ అన్నారు. ప్రతిపాదిత కొత్త రహదారి గుండా వెళుతున్న భారీ వాహనాల నుండి కాలుష్యం మరియు కంపనం కారణంగా పురాతన కట్టడాలకు తీవ్ర నష్టం కలుగుతుందని నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు.

చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ బసవన్న ఆలయమును అనుకునే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే, వీరభద్రస్వామి ఆలయం సమీపంలో నిర్మాణం చేపడుతున్నారని.. దీని వల్ల ప్రపంచ విఖ్యాత బసవన్న, వీరభద్రస్వామి ఆలయాలకు తీరని నష్టం జరగబోతోందని జగన్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ రెండు దేవాలయాలను భారత పురావస్తు శాఖ కాపాడుతోందని.. చట్ట ఉల్లంఘనలను ఎత్తిచూపినప్పటికీ, లేపాక్షిలో రహదారి వెడల్పు ప్రణాళికలను మార్చలేదని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

మీ పార్టీకి చెందిన కొంతమంది స్థానిక నాయకులు నిబంధనలను ఉల్లంఘిస్తూ విస్తృత పనులను చేపట్టాలని  అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని నరసింహారావు ఆరోపించారు. ఈ విషయంలో మీరు సానుకూలంగా స్పందించి  చర్యలు చేపట్టాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.