వెనుకబడిన ప్రాంతాల కేటాయింపులపై శ్వేత పత్రం: బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్
ఏపీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షం విఫలమయ్యాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మూడేళ్లలో రాష్ట్రంలో ఏం అభివృద్ది చేశారని సీఎం జగన్ ను ప్రశ్నించారు ఎంపీ.
అమరావతి:వెనుకబడిన ప్రాంతాలకు చేసిన కేటాయింపులపై ఏపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు.సోమవారం నాడు అమరావతిలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షం విఫలమైందన్నారు. మూడేళ్లలో జగన్ సర్కార్ చేసిన అభివృద్ది ఏమీ లేదని ఆయన చెప్పారు. మూడు రాజధానులపై చూపుతున్న ప్రేమ అభివృద్దిపై లేదని ఏపీ సీఎం జగన్ తీరును బీజేపీ ఎంపీ తప్పుబట్టారు.
టీడీపీ, వైసీపీలు రాయలసీమలోని ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఒకరు అమరావతి మరొకరు విశాఖలో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారని టీడీపీ, వైసీపీలపై ఆయన మండిపడ్డారు. రాయలసీమ జిల్లాలకు చెందినప్పటికి చంద్రబాబు, వైఎస్ జగన్ లు ఆ ప్రాంతానికి ఏమీ చేయలేదని జీవీఎల్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు యాత్ర నిర్వహిస్తామన్నారు. ప్రజా యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులను బీజేపీ కూడా తప్పు బడుతుంది. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని కేంద్రం ప్రకటించింది. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే అమరావతి రాజధానికే తాము కట్టుబడి ఉన్నామని బీజేపీఏపీ నేతలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో రాజధానికి శంకుస్థాపన చేశారు. విపక్షంలో ఉన్న సమయంలో అమరావతికి అంగీకరించి ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకురావడంపై వైసీపీపై విపక్షాలు మండిపడుతున్నాయి. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి మాసంలో కీలకక తీర్పు ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మూడు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 15వ తేదీన ఏపీ అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణపై జరిగిన చర్చ జరిగింది.పాలనా వికేంద్రీకరణ వల్లే అభివృద్ది సాధ్యమని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు.