ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. కొన్నిరోజుల్లోనే టీడీపీ ముఖచిత్రం మారిపోతుందన్నారు. 

తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని తెలిసే ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారంటూ చెప్పుకొచ్చారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. బీజేపీలో చేరే వారికి కేసుల నుంచి రక్షణ లభించదన్నారు. 

ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో వారే వ్యక్తిగతంగా కేసులు ఎదుర్కొనక తప్పదన్నారు. చట్టప్రకారమే టీడీపీ రాజ్యసభపక్షం విలీనం అయ్యిందని వెల్లడించారు. అందులో తప్పేమీ లేదన్నారు. కోవర్టు ఆపరేషన్లు కోసం వస్తోన్న వారిపై నిఘా ఉంటుందని వెల్లడించారు. 

ఇకపోతే తమపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను లాక్కొని వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం, ముగ్గురు ఎంపీలను తీసుకున్న తెలుగుదేశం పార్టీకి తమను విమర్శించే అర్హత లేదని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.