విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో బూటకపు పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్న ఉద్దేశం ఒకటి చెప్తున్నదొకటని విమర్శించారు. 

ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు వెళ్తున్న చంద్రబాబు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్తున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
 
చంద్రబాబు విమానం ఎక్కే లోపు ఐక్యరాజ్యసమితి పంపిన ఇన్విటేషన్‌ను మీడియాకు విడుదల చేయాలని జీవీఎల్  డిమాండ్ చేశారు. న్యూయార్క్‌లో సదస్సు పెట్టినంత మాత్రాన  ఐక్యరాజ్యసమితిలో సమావేశం పెట్టినట్లు కాదన్నారు. 

వరల్డ్ ఎకనామిక్ వారు న్యూయార్క్‌లో పెడుతున్న రెండో సమావేశమని అందులో పాల్గొనేందుకే చంద్రబాబు వెళ్తున్నారని వివరించారు. చంద్రబాబు గొప్పల కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేయొద్దని జీవీఎల్ హితవుపలికారు.