రాజమహేంద్రవరం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చిన ప్రధానికి స్వాగతం చెప్పని బాబు ఇక సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సి వస్తోందంటూ హెచ్చరించారు. 

రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు ఏపీకి మోదీ ప్రభుత్వం ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని స్పష్టం చేశారు. మరోవైపు మార్చి ఒకటిన విశాఖపట్నంలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమం కానున్నారని తెలిపారు. 

అలాగే ఫిబ్రవరి 19న ఒంగోలులో, 21న రాజమహేంద్రవరంలో అమిత్ షా బహిరంగ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడానికి చంద్రబాబు ఇప్పటికే రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. 

రాజధాని నిర్మాణం కోసం మోదీ నర్మదా నది నుంచి నీళ్లు, మట్టి తెస్తే చంద్రబాబు ఆనందంగా స్వీకరించారని ఇప్పుడు విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద భోజనాల కాంట్రాక్టర్‌ ఇరిగేషన్‌ మంత్రి బంధువుదేనని స్పష్టం చేశారు. 

బీజేపీ మండలానికో సబ్‌ స్టేషన్‌ కట్టిస్తే టీడీపీ అందులో ఉద్యోగాలు అమ్ముకుంటోందని ఆరోపించారు. గోద్రా సంఘటన నుంచే చం‍ద్రబాబు ప్రధాని మోదీపై కక్ష గట్టారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు.