కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీలో చేరేందుకు టీడీపీకి చెందిన కీలక నేతలు చాలా మంది ఉన్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ చేరేందుకు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన తమ పార్టీ ఎన్జీఓ, ట్రస్ట్ కాదని ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేరవచ్చన్నారు. 

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని 2024 ఎన్నికలలోపు ఓ బలమైన శక్తిగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు తమ పార్టీలో చేరారని తెలిపారు. 

దేశంలో అన్ని పార్టీల నుంచి నాయకులు తమ వైపు చూస్తున్నారని.. ఎవరు వచ్చినా మా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. బీజేపీలో టీడీపీని విలీనం చేయాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ సైతం ఇచ్చారు. 

టీడీపీ రాజ్యసభ సభ్యుల లేఖను అందుకున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో వారిని విలీనం చేసేందుకు ఆమోదముద్ర వేశారు. అనంతరం టీడీపీ ఎంపీలు కాస్త బీజేపీ ఎంపీలుగా రాజ్యసభ వెబ్ సైట్ లో కూడా పొందుపరిచిన సంగతి తెలిసిందే.