అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. చంద్రబాబు అబద్దాలు చెప్పడంలోనూ, రాయడంలోనూ చిత్రగుప్తుడుని మించిపోయాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అనంతపురంలో కియా సంస్థను కేంద్రం ఏర్పాటు చేస్తే అది తానే ఇచ్చినట్లు చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు  కేంద్రం వల్లే ఏపీలో అభివృద్ధి జరిగిందే తప్ప చంద్రబాబు వల్ల కాదన్నారు. 

ఏపీలో జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు వెళ్లుండా కొత్త వివాదాలు లేవనెత్తారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా కావాలంటూ నాటకం ఆడుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు. యూటర్న్ లు ఎక్కువగా తీసుకున్న పేరు చంద్రబాబుకే దక్కిందన్నారు. 

వివాదాలు సృష్టించడంలో చంద్రబాబు దిట్ట అంటూ విమర్శించారు. బాబు తిరోగమనంవైపు పయనిస్తున్నారని ఐదేళ్లలో ఆయన తీరు బాధాకరమన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు అవినీతిని పెంచి పోషిచారని మండిపడ్డారు. మోదీవల్ల 20 రకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో, పట్టణాల్లో జరిగాయని స్పష్టం చేశారు. 

అవినీతి కింది స్థాయి వరకు చంద్రబాబు తీసుకెళ్లారని ఆరోపించారు. ఇసుకపై రూ.16వేల కోట్ల రూపాయలు అప్పనంగా మేసేశారని ఆరోపించారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ పైనా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మంగళగిరి అని స్పష్టంగా పలకలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. తింగరిమంగళం లోకేష్ అంటూ సెటైర్లు వేశారు.