అమరావతి: బీజేపీ వీడతారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. గత కొంతకాలంగా బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన కండువా కప్పుకోవడంతో ఇక నెక్స్ట్ విష్ణుకుమార్ రాజేనని ప్రచారం జోరుగా సాగుతోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ఓడిపోతే ఇంట్లో కూర్చుంటానే తప్ప పార్టీ మారనని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీ మారడంపై స్పందించిన విష్ణుకుమార్ రాజు  కొంతమంది నేతలు పార్టీ మారినంత మాత్రాన మా పార్టీ ఖాళీకాదన్నారు. 

బీజేపీ చిన్న పార్టీ కాదని అతిపెద్ద పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో 40 లక్షల మంది సభ్యులు ఉన్నారని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన అవినీతమయమైందన్నారు. రాష్ట్రంలో కుంభకోణాలు బయట పెట్టింది తానేనని చెప్పుకొచ్చారు. తన పేరు చెబితే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు. 

అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో లెవనెత్తి గట్టిగా పోరాటం చేశానని గుర్తు చేశారు. తనలాంటి నిజాయతీపరుడైన ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఇంట్లో కూర్చుంటా. నాకేమీ నష్టంలేదు. ప్రజలకే నష్టం’’ అని విష్ణుకుమార్‌ రాజు స్పష్టం చేశారు.