Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా...?: బాబుపై బీజేపీ నేత వ్యాఖ్యలు

ఓటమి భయంతో తన దుకాణాన్ని అమరావతి నుంచి ఢిల్లీకి మార్చి ఈవీఎంల పేరుతో డ్రామాలు మొదలెట్టారని విమర్శించారు. ఆంధ్రలో చెల్లని రూపాయి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలా చెల్లుతుందుని ప్రశ్నించారు. చంద్రబాబు ఓటు వేసిన రెండు గంటల్లోనే 30 శాతం ఈవీఎంలు పని చేయలేదని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. 

bjp leader vishnuvardhan reddy slams chandrababu
Author
Amaravathi, First Published Apr 13, 2019, 3:55 PM IST

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెల్లని రూపాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి. ఓటమి భయంతోనే చంద్రబాబు   ఈవీఎంలు పనిచేయడంలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

ఓటమి భయంతో తన దుకాణాన్ని అమరావతి నుంచి ఢిల్లీకి మార్చి ఈవీఎంల పేరుతో డ్రామాలు మొదలెట్టారని విమర్శించారు. ఆంధ్రలో చెల్లని రూపాయి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలా చెల్లుతుందుని ప్రశ్నించారు. 

చంద్రబాబు ఓటు వేసిన రెండు గంటల్లోనే 30 శాతం ఈవీఎంలు పని చేయలేదని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి పడుతుంది అంటున్న చంద్రబాబు ఒకవేళ తమ పార్టీకి ఓట్లు రాకపోతే ఈవీఎంలను మేనేజ్ చేసినట్లు చంద్రబాబు ఒప్పకుంటారా అని సవాల్‌ చేశారు. 

రూ.5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మేనేజ్ చేస్తామని కొందరు తన వద్దకు వచ్చారంటున్న చంద్రబాబు తన కార్యాలయం ఏమైనా దొంగలకు అడ్డానా ఏంటో చెప్పాలని చెప్పుకొచ్చారు. ఈదేశంలో ఈవీఎంల దొంగల ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ నేతలు మాత్రమే అని విమర్శించారు. 

ఆంద్రప్రదేశ్ దొంగలంతా చంద్రబాబు పక్కనే ఉన్నారని విమర్శించారు. ఈవీఎంలు, ఐటీ గ్రిడ్ చోర్ లకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అని విమర్శించారు. మహంతి కుటుంబానికి మంచి పేరు ఉందని అలాంటి అతన్ని కడప నుండి ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని నిలదీశారు. 

వ్యవస్థలో పని చేసే ఏ ఒక్క అధికారిని చంద్రబాబు గౌరవించరన్న విష్ణువర్థన్ రెడ్డి ఎన్నికల్లో టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. మోదీని తిడితే ఓట్లు పడవన్నారు. చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానాలు కలుగుతోందన్నారు. 

2014 ఎన్నికల్లో డీజీపీని తప్పించాలని లేఖ రాసి మార్పించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు డీజీపీని మారిస్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఏపీలో దుష్ట పాలన పోవాలని స్పీడ్ బ్రేకర్ ప్రభుత్వం పోవాలని తాము ఓట్లు అడిగినట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios