విజయవాడ: ఎట్టకేలకు 20 గంటల తర్వాత అక్రమ నిర్బంధం నుంచి తనను గుడివాడ పోలీసులు విడిచిపెట్టారని  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో భయభ్రాంతులు సృష్టించి పోలీసులను ఉపయోగించి ప్రత్యర్థి రాజకీయ పార్టీలను అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని... అలాగే ప్రజలను కుల, మత ప్రాతిపదికన విభజించి పాలించాలని ప్రయత్నిస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

''అంతర్వేది రథం కాలిన విషయంలో డీఐజీని, ఎస్పీ ,డియస్పిని నేటి వరకు బాధ్యతగా ఎందుకు సస్పెండ్ చేయడం లేదు?_అసలు అంతర్వేది సంఘటన ప్రభుత్వం మరియు పోలీసులు కొన్ని మతాలకు సంబంధించిన కుట్రగా మాకు అనుమానం వస్తోంది. ఎందుకంటే అక్కడ సంఘటన జరిగిన తరువాత నేటికి  భాద్యులైన  పోలీసుల మీద చర్య తీసుకోలేదు. నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకొకుండా ప్రభుత్వం నేటివరకు ఉన్నతాధికారులను కాపాడటం అనుమానాలకు తావునిస్తోంది'' అన్నారు. 

''మీరు హిందు భక్తులను శిక్షిస్తున్నారు. దుండగులను సిబిఐ పేరుతో పరోక్షంగా కాలయాపన చేసి కాపాడుతున్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ప్రజలను రక్షించలేని ఈ ప్రభుత్వం విధానంతో  మీకు అధికారంలో ఉండే హక్కు ఉందా జగన్ మోహన్ రెడ్డి గారు. బీజేపీ పార్టీ హిందూ ధర్మం కోసం, దేవాలయ రక్షణ, దేవాలయ ఆస్తుల రక్షణ కోసం చేస్తున్న మా పోరాటం ఆగదు. మేము ఇతర మతాలను గౌరవిస్తాం అదే సందర్భంలో హిందూ మతాన్ని రక్షించుకుంటాం'' అని అన్నారు. 

వీడియో

"

''ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రి ఉన్నారా లేదా అని అనుమానం ప్రజలకు వస్తోంది?_ఒకవేళ ఉంటే నేటివరకు ఇన్ని దేవాలయాలపై దాడులు జరుగుతుంటే హోంమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదు. రాష్ట్ర హోంమంత్రి ఇంటికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత గల హోంమంత్రి స్పందించకుండా ఉండేకన్నా రాజీనామా చేసి ఇంటికే పరిమతమైతే  మంచిది'' అని మండిపడ్డారు.

''హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులు, హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు యాదృచ్చికం కాదు. దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతుంది. పౌరుల హక్కులు హరించే హక్కు ప్రభుత్వానికి, పోలీసులకు ఎవరిచ్చారు? ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం పౌర సమాజ హక్కులు ఉద్దేశపూర్వకంగా కాలరాస్తున్నారు. బిజెపి ఈ అరెస్టులు, నిర్బందాలు, భయభ్రాంత రాజకీయాలు, అక్రమ అరెస్టులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏపీలొ హిందూ ధర్మ, దేవాలయాల పరిరక్షణ కొరకు బిజెపి మరింత ముందుకు వెళ్ళి ప్రజాక్షేత్రంలో పోరాడుతుంది'' అని విష్ణువర్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.