పుదుచ్చెరీకి ప్రత్యేక హోదా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని... నిజానిజాలు తెలుసుకుని మాట్లాడివుంటే బావుండేదంటూ టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ పై విష్ణువర్దన్ సెటైర్లు విసిరారు. 

అమరావతి: పుదుచ్చెరీకి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారంటూ టిడిపి చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడివుంటే బావుండేదంటూ టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ పై విష్ణువర్దన్ సెటైర్లు విసిరారు. 

''ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయాలనుకున్నారా?లేదా మీరే ఏప్రిల్ ఫూల్ కావాలనుకున్నారా?లోకేష్ గారు. పాండిచ్చేరి మేనిఫెస్టోను 4రోజుల క్రిందట బిజేపీ ప్రకటించింది. అందులో ఎక్కడా ప్రత్యేక హోదా అంశం లేదు. తిరుపతి ఉప ఎన్నికలలో బిజేపీ మీద దుష్ప్రచారం కోసం నీ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ తెలివితేటలు ప్రదర్శించారా!'' అని విష్ణువర్దన్ మండిపడ్డారు. 

పుదుచ్చెరి ఎన్నికల నేపథ్యంలో బిజెపి మేనిపెస్టోలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ బిజెపి, వైసిపిపై విరుచుకుపడ్డారు. 

''మోదీ మెడ ‌వంచి తెస్తాన‌న్న ప్ర‌త్యేక‌హోదాని తాక‌ట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయ‌మైన ప్ర‌త్యేక‌హోదా పుదుచ్చేరిలో ఎలా మొద‌ల‌వుతుందో?'' అంటూ ట్విట్టర్ వేదికన లోకేష్ ప్రశ్నించారు.

''రాష్ట్రంలో క‌మ‌లంతో ర‌హ‌స్య ప్ర‌యాణాన్ని క‌ట్టిపెట్టేసి పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం వైకాపా నాయకులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు వైఎస్ జగన్.. మీ కేసుల గురించి కాకుండా కాస్తా ప్ర‌త్యేక‌హోదా కోసం ఇప్ప‌టికైనా గ‌ట్టిగా అడ‌గండి'' అని లోకేష్ సూచించారు.