ప్రభుత్వానికి తొత్తులుగా వుండొద్దు.. చంద్రబాబు అరెస్ట్ సరికాదు : పోలీసులపై సోము వీర్రాజు ఫైర్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంపై స్పందించారు బీజేపీ నేత సోము వీర్రాజు . పోలీస్ శాఖ వాస్తవాలను గుర్తించాలని .. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించొద్దని ఆయన సూచించారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంపై స్పందించారు బీజేపీ నేత సోము వీర్రాజు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును బీజేపీ ఖండిస్తుందన్నారు. చంద్రబాబును ఎలాంటి వివరణ అడగకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం సరికాదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్‌లో పేరు లేకపోయినప్పటికీ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పోలీస్ శాఖ వాస్తవాలను గుర్తించాలని సోము వీర్రాజు హితవు పలికారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించొద్దని ఆయన సూచించారు. ఇక జీ20 సమావేశాల గురించి సోము వీర్రాజు మాట్లాడుతూ.. జీ20 సమ్మిట్‌లో భారత్ ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించిందన్నారు. గతంలో ఏదో ఒక ప్రదేశంలోనే సమావేశాలు జరిగేవని.. కానీ భారత్‌లోని 60 ప్రాంతాల్లో 200 సమావేశాలు నిర్వహించామని సోము వీర్రాజు చెప్పారు.
ALso Read: ఇదేం పద్ధతి: చంద్రబాబు అరెస్టుపై పురంధేశ్వరి ఘాటు ప్రశ్న
అంతకుముందు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును ఆమె తప్పు పట్టారు. ప్రోసీజర్ పాటించకుండా చంద్రబాబును అరెస్టు చేయడమేమిటని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు సమర్థనీయం కాదని ఆమె అన్నారు.ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును ఆమె ఖండించారు.