ఇదేం పద్ధతి: చంద్రబాబు అరెస్టుపై పురంధేశ్వరి ఘాటు ప్రశ్న
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై బిజెపి అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేసిన పద్ధతిని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసిన పద్ధతి సరి కాదని పురంధేశ్వరి అన్నారు.

విజయవాడ: స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎపి సిఐడి అరెస్టు చేయడంపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును ఆమె తప్పు పట్టారు. ప్రోసీజర్ పాటించకుండా చంద్రబాబును అరెస్టు చేయడమేమిటని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు సమర్థనీయం కాదని ఆమె అన్నారు.ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును ఆమె ఖండించారు.
చంద్రబాబు అరెస్టును సిపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు అర్థరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నారా లోకేష్ సహా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలను నిర్బంధించడం దుర్మార్గమని ఆయన అన్నారు. మార్గదర్శిపై కూడా సిఐడి దుందుడుకుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రతిపక్షాలను వేధించడానికి ఇది పరాకాష్ట అని ఆయన అన్నారు.
టిడిపి నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టు చేశారు. పలు జిల్లాల్లో ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో ఎపి సీఐడి అధికారులు చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఎ1గా చేర్చారు. మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావును, ఆయన కుమారుడిని కూడా అరెస్టు చేశారు.
నంద్యాల నుంచి చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. ఆయన కాన్వాయ్ పందిళ్లపల్లి టోల్ గేట్ కు చేరుకుంది. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. ఇది 330 కోట్ల రూపాయల కుంభకోణం. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందని, అన్ని విషయాలు రిమాండు రిపోర్టులో ఉన్నాయని, ఆ విషయం హైకోర్టకు చెప్పామని సిఐడి అధికారులు అంటున్నారు.