అమరావతి: జగన్ ఏడాది పాలనపై  శుభాకాంక్షలు చెబితే   ఇంతకాలం పాటు చేసిన పాపాలను మరిచిపోయినట్టు కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బెయిల్ మీద ఒకరు ఉంటే, మరొకరు బెయిల్ కోసం ఉన్నారన్నారు. 

బుధవారం నాడు ఆయన అమరావతిలో పార్టీ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆంధ్రలో పాలన అంతా రివర్స్ గా సాగుతోందన్నారు.
రాజదాని అమరావతితో రివర్స్ పాలనను జగన్ ప్రారంభించారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడ రివర్స్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

మధ్యనిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చి కొత్త కొత్త మద్యం బ్రాండ్లను విచ్చల విడిగా రాష్ట్రంలో అమలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని ఆయన ఎద్దేవా చేశారు

తిరుమల భూముల విషయంలో జగన్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురైందన్నారు. తిరుమల విషయంలో కూడ రివర్స్ లో వెళ్లి దెబ్బతిందన్నారు.ఏపీలో పన్నుల వసూళ్లు లేకపోయినా కేంద్రం రాష్ట్రానికి వాటా ఇచ్చిందన్నారు. 

పలు పథకాల కింద కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి నిధులు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ ఏడాది కేంద్రం నుండి 45 వేల కోట్లు రాష్ట్రానికి కేంద్రం నుండి  సహాయం అందినట్టుగా ఆయన స్పష్టం చేశారు.

సుమారు 60 సార్లు హైకోర్టు చేతిలో మొట్టికాయలు తిన్న  ప్రభుత్వం దేశంలో మరేది లేదన్నారు. వారానికి ఒక్కసారి ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు.