విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు తమ వంత కృషి చేస్తామని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరీ స్పష్టం చేశారు. 

ఆదివారం నాడు విశాఖపట్టణంలో  ఆమె మీడియాతో మాట్లాడారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రజల మనోభావాల్ని కేంద్రానికి వివరిస్తామని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరీ చెప్పారు. ఉక్కు కర్మాగారంతో ఆంధ్రప్రజలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తామన్నారు.

అసాధారణ పరిస్థితుల్లో కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టుగా ఆమె చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నష్టం జరగనివ్వబోమని ఆమె హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాధవ్ వెంటనే స్పందించారని ఆమె గుర్తు చేశారు.

బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమిచ్చారని చూడకూడదన్నారు.  కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు రాష్ట్ర ఎంపీల దృష్టికి వచ్చి ఉండాల్సిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని గత ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.