వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై బిజెపి నాయకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి స్పందించారు.
విజయవాడ: జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జనసేన చీఫ్ వ్యాఖ్యలు బిజెపికి ఊరటనిచ్చేలా వుంటే తెలుగుదేశం పార్టీకి మాత్రం మింగుడుపడకుండా వున్నాయి. ఇప్పటికే పలుమార్లు తాను తగ్గానని... ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందని పవన్ వ్యాఖ్యానించారు. అంటే ఈసారి పొత్తుల విషయంలో బిజెపి, టిడిపి తగ్గాలన్నదే పవన్ ఉద్దేశ్యం.
ఇలా పొత్తుల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పందించారు. జనసేనతో బిజెపి పొత్తు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని నిన్న (శనివారం) తమ మిత్రపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పారని అన్నారు. అయితే పొత్తు అంశంపై ఎలా వెళ్లాలనేది మాత్రం జాతీయ నాయకులు నిర్ణయిస్తారని పురంధేశ్వరి పేర్కొన్నారు.
బిజెపి, జనసేన మధ్య గ్యాప్ ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. రాష్ట్ర బిజెపి నాయకత్వంతో జనసేన రాష్ట్ర నాయకులు మాట్లాడుతూనే ఉన్నారన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొంత గ్యాప్ ఉన్నమాట నిజమేనన్నారు. కరోనా వల్ల సోషల్ డిస్టెన్స్ పెరిగిందంటూ పవన్ సరదా వ్యాఖ్యలను పురంధేశ్వరి గుర్తుచేసారు.
సమన్వయంతో బిజెపి, జనసేన పార్టీ లు ముందుకు వెళుతున్నాయని... పొత్తుల విషయంలో తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసే ముందుకెళతామని పరంధేశ్వరి స్పష్టం చేసారు. ఆత్మకూరు ఉపఎన్నికల్లో అభ్యర్థిపై జనసేనతో చర్చించామన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్థే బరిలో వుంటాడని... అతడికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని పురంధేశ్వరి ప్రకటించారు.
ఇక వైసిపి ప్రభుత్వం స్థాయికి, పరిమితికి మించి అప్పులు చేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ఉన్న అరాచక పరిస్థితి వల్ల పెట్టుబడి పెట్టే అవకాశం లేదన్నారు. ఎనిమిదేళ్లు అయినా ఏపికి రాజధాని లేదన్నారు. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాని అన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీని అనేక రాష్ట్రాల సిఎంలు కలుస్తారు... అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కలిసారు... ఇందులో తప్పేముందని అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి భేటి అయినంత మాత్రాన బిజెపి, వైసిపి ఒక్కటేనని దుష్ఫ్రచారం తగదని పురంధరేశ్వరి అన్నారు.
ఇదిలావుంటే శనివారం జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై పవన్ కల్యాణ్ స్పందించారు. లన వ్యాఖ్యలు చేశారు. గతంలో వన్‌సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన చంద్రబాబు .. ఇప్పుడు వార్ వన్‌సైడ్ అంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక మిగిలిన విషయాలు మాట్లాడతామన్నారు.
రాష్ట్రం కోసం తాను తగ్గడానికి సిద్ధమన్న పవన్... ఇప్పటికే అన్నిసార్లు తానే తగ్గానని అన్నారు. ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందంటూ టిడిపి, బిజెపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జనసేన ముందు మూడు ప్రత్యామ్నాయాలు వున్నాయని పవన్ చెప్పారు. ఒకటి జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రెండోది జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మూడోది జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం... ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని పవన్ పిలుపునిచ్చారు.
