రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా బీజేపీ నేతలు కూడా మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బీజేపీ నేతలు మౌనదీక్ష చేపట్టారు. ఉద్దంబరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ దీక్ష ప్రారంభించారు.

పవిత్ర నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి ముందుగా ఆయన నమస్కరించారు. అనంతరం దీక్ష ప్రారంభించారు. ఆయనతోపాటు పలువురు నేతలు కూడా మౌన దీక్షలో పాల్గొన్నారు.  

ఇదిలా ఉండగా ఏపీలో 3 రాజధానుల వ్యవహారంపై రచ్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక సమర్పించిన రోజు నుంచీ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు. రైతుల నిరసనలకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతిచ్చాయి.

ఈ నేపథ్యంలోనే... బీజేపీ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... ఈ నిర్ణయం తీసుకుంది. రాజధానిని తరలించడమంటే జగన్‌ అవగాహనరాహిత్యాన్ని బయటపెట్టుకోవడమేనని కన్నా ఇటీవల విమర్శించారు. జగన్‌కు అనుభవరాహిత్యంతో పాటు అవగాహన రాహిత్యం ఉందన్నారు.