వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం మీడియా తో మాట్లాడిన ఆయన వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దోషులను తప్పించి.. అమాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇందులో భాగంగానే పోలీసు అధికారులను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. కేసును సీబీఐకి అప్పగించాలంటూ.. వివేకా కుటుంబ సభ్యుల కంటే ముందే తాను సీఎంకు లేఖ రాశానని కన్నా వెల్లడించారు. తన తండ్రి ఆశయాలు, సిద్ధాంతాలపై జగన్‌కు నమ్మకం ఉంటే.. పరిటాల రవి హత్య కేసు మాదిరిగా వివేకా హత్య కేసునూ సీబీఐకి అప్పగించాలన్నారు. జగన్.. వైఎస్ రాజకీయ వారసుడయితే స్వచ్ఛందంగా సీబీఐ విచారణ కోరాలని కన్నా పేర్కొన్నారు.

Also Read వివేకా హత్యపై హైకోర్టులో సునీత పిటిషన్: వైఎస్ జగన్ కు చిక్కులు...

ఇదిలా ఉండగా.. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కుమార్తె కోర్టులో పిటిషన్ వేశారు.  వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సిట్ విచారిస్తోంది. ఈ హత్య జరిగిన సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.

ఈ హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని  టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మరో వైపు ఈ కేసు విచారణను సిట్ మరింత వేగవంతం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతించాలని  కోరుతూ సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేదని పరమేశ్వర్ రెడ్డి కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధానంగా ప్రస్తావించింది. జగన్ పై ఆ నాడు చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు విమర్శలపై వైసీపీ కూడ ఎదురు దాడికి దిగింది.

అయితే ఈ విషయమై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు హైకోర్టును ాశ్రయించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయమై ఎలాంటి ప్రకటనలు చేయకూడదని హైకోర్టు ఆ సమయంలో ఆదేశాలు జారీ చేసింది. 

చంద్రబాబునాయుడు ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం కూడ ఈ కేసును కూడ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీకి చెందిన నేతలను విచారించింది.