తెలుగు రాజకీయాల్లో మరోసారి యాక్టీవ్ కావాలని భావిస్తోన్న అలనాటి సినీనటి , బీజేపీ నేత జయప్రద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని పరిస్థితుల వల్లే తాను ఉమ్మడి ఏపీని వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. 

ఏపీ రాజ‌కీయాల‌పై (ap politics) ప్ర‌ముఖ సినీ న‌టి, మాజీ ఎంపీ, బీజేపీ (bjp) నేత జ‌య‌ప్ర‌ద (jayaprada) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగళవారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో (rajamahendravaram) జరిగిన బీజేపీ గ‌ర్జ‌న బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కొన్ని అనివార్య ప‌రిస్థితుల వ‌ల్ల‌నే తాను రాష్ట్ర రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యాన‌ని జయప్రద వెల్లడించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అప్పుల ప్ర‌దేశ్‌గా మారుస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు అట్ట‌డుగు స్థాయికి వెళుతున్నాయ‌ని జయప్రద చెప్పారు. 

యువ‌త‌కు స‌రైన ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో మ‌హిళ‌ల‌కు ఎలాంటి ర‌క్ష‌ణ లేకుండాపోయింద‌ని దుయ్యబట్టారు. ఈ నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల్లో బీజేపీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జయప్రద పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజమండ్రి తన స్వస్థలమని.. ఇక్కడి నుంచే దేశ రాజకీయాల్లోకి వెళ్లినట్లు ఆమె చెప్పారు. మన ఊరు, మనవాళ్లను వదిలి వెళ్లినందుకు క్షమించండి అంటూ తెలుగు ప్రజలను కోరారు. తాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకుంటున్నట్లు మరోసారి జయప్రద తన మనసులో మాటను చెప్పారు. 

ALso Read:తెలుగు రాజకీయాలపై జయప్రద ఆసక్తి.... మనసులో మాట బయటపెట్టి..!

ఇదే సభలో బీజేపీ (bjp) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) మాట్లాడుతూ.. మోడీ (narendra modi) హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. మోడీ దేశంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. దేశ సంస్కృతిని మోడీ మారుస్తున్నారని నడ్డా పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ అయిన ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి సాయం చేస్తున్నారని... అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా కరోనాను నియంత్రించారని నడ్డా గుర్తుచేశారు. దేశంలో ఎయిమ్స్ సంఖ్యను మోడీ పెంచారని ఆయన పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడానికే జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారని ఆమె పేర్కొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి కానీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎవరూ పనిచేయలేదని జయప్రద దుయ్యబట్టారు. ఏపీలో రూ. 7 లక్షల కోట్లు అప్పు చేశారని.. కానీ, పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.