అమరావతి: తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.

గురువారం నాడు కడప జిల్లాలో  బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. . వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఆదుకోవడానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. పోలవరానికి నిధులిచ్చిన తరహాలోనే  రాయలసీమ ప్రాంతాల అభివృద్దికి కేంద్రం ముందడుగు వేస్తోందన్నారు.

చంద్రబాబు హయంలో కొంత అవినీతి జరిగినా ఇసుక మాత్రం అభ్యమయ్యేదన్నారు. జగన్ సీఎం అయ్యాక ఇసుక దొరకడమే లేదన్నారు. ఇసుకపై త్వరలోనే ఉద్యమం చేపడుతామని వీర్రాజు చెప్పారు.

లాక్ డౌన్ కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.కడప జిల్లాలో 50 శాతానికిపైగా జడ్పీటీసీ, ఎంపీటీసీలను వైసీపీ ఏకగ్రీవం చేసుకొందన్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ ను స్థానిక సంస్థల ఎన్నికల కోసం వీర్రాజు  ఉత్సాహపరుస్తున్నాడు.