అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. విజయసాయిరెడ్డికి బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ దేవధర్ లు ఎదురుదాడికి దిగారు.

 

 వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలు భగ్గుమన్నారు.. టీడీపీ వాళ్ల చేరికతో బిజెపి ఏమవుతుందో తెలియడం లేదని బిజెపి రంగు మారుతోందని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సునీల్ దేవధర్ తో పాటు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణలు స్పందించారు. 

 

రఘురామకృష్ణమ రాజు వ్యవహారంతో మీ పార్టీ రంగు మారుతోందని అది చూసుకోవాలని సునీల్ దేవధర్ విజయసాయి రెడ్డిని ఉద్దేశించి అన్నారు. పసుపు మాత్రమే కాదు అన్ని రంగులను కూడా కాషాయం చేస్తామని ఆయన అన్నారు. మొదట మీ పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. 

విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ విషయమై  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. విజయసాయి రెడ్డికి తగిన సూచనలు ఇవ్వాలని ఆయన జగన్ ను కోరారు. తమ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టడం మానుకుని సొంత పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని ఆయన విజయసాయి రెడ్డికి సలహా ఇచ్చారు.