విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తెలుగుదేశం పార్టీని నడిపించే సత్తా చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. త్వరలో పార్టీ మునిగిపోతుందని గ్రహించే ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. 

బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలుస్తుందంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ లో చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారని తెలిపారు. ఏపీలో బీజేపీయే ప్రతిపక్ష పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. 

మరోవైపు జగన్ పైనా సెటైర్లు వేశారు కన్నా లక్ష్మీనారాయణ. సీఎం జగన్ ఎవరితో స్నేహం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొదని సూచించారు. 

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వైఫల్యాలను శ్వేతపత్రంలో తెలియజేయడమే కాదని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి అక్రమాలను వదలొద్దని కోరారు. టీడీపీ అవినీతి, అరాచకాలపై సీబీఐ విచారణ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.