స్విస్ ఛాలెంజ్ విధానంపైనే కాదు అసలు సింగపూర్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకన్న ఒప్పందాలపై చాలామందికి ఎటువంటి సమాచారం లేదన్నది వాస్తవం. చంద్రబాబు, నారాయణకు తప్ప మూడో వ్యక్తికి ఎటువంటి సమాచారం లేదని అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఆర్డీఏ లోని ఉన్నతాధికారులకు కూడా ఎంత వరకూ అవసరమో అంతే సమాచారం అందుతోంది.
రాష్ట్రంలో విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. ప్రతిపక్షానికి అధికార టిడిపి మిత్రపక్షమైన భాజపా మద్దతుగా మాట్లాడుతోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేపట్టిన స్విస్ ఛాలెంజ్ పై సర్వత్రా ఆరోపణలు, అనుమానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే కదా? అటువంటి నేపధ్యంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా అనేక ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే, జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనంటూ భాజపా డిమాండ్ చేయటం విచిత్రం.
భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజేయనేయరెడ్డి నెల్లూరులో మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ పై జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అసలు స్విస్ ఛాలెంజ్ విధానంపై మంత్రుల్లో సరైన అవగాహనే లేదని ఓ బాంబు పేల్చారు. కర్నాటి చేసిన వ్యాఖ్యలతో టిడిపి నేతల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
ఎందుకంటే, కర్నాటి చెప్పినదాంట్లో తప్పేమీ లేదు. స్విస్ ఛాలెంజ్ విధానంపైనే కాదు అసలు సింగపూర్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకన్న ఒప్పందాలపై చాలామందికి ఎటువంటి సమాచారం లేదన్నది వాస్తవం. చంద్రబాబు, నారాయణకు తప్ప మూడో వ్యక్తికి ఎటువంటి సమాచారం లేదని అందరికీ తెలిసిందే.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఆర్డీఏ లోని ఉన్నతాధికారులకు కూడా ఎంత వరకూ అవసరమో అంతే సమాచారం అందుతోంది. రాజధాని నిర్మాణం వ్యవహారం మొత్తం తన ఇంటి వ్యవహారంగా చంద్రబాబు మొదటి నుండి నడుపుతున్నారు. అందుకే అంతటి ఆరోపణలు, కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయ్.
అటువంటి పరిస్ధితిల్లో మంత్రులకు, ఎంఎల్ఏ,ఎంపిలకు ఇంకేం సమాచారం తెలుస్తుంది? అందుకే పార్టీ, ప్రభుత్వం మొత్తం మీద మూడో వ్యక్తి నోరు మెదపటం లేదు రాజధాని నిర్మణంపై. ఇటువంటి నేపధ్యంలో జగన్ చేస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని భాజపా డిమాండ్ చేయటమంటే మాటలా? పైగా మంత్రివర్గానికే సరైన సమాచారం, అవగాహన లేదని కర్నాటి కుండబద్దలు కొట్టడం మంత్రులకు మండిపోతోందట.
జగన్ లేవనెత్తిన ప్రశ్నల్లో తప్పేమీ లేదన్నారు. ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడులు చేయటంలో ఎటువంటి ఉపయోగం లేదని తేల్చేసారు. జగన్ రైతుదీక్ష చేయటం కూడా సబబేననటం కొసమెరుపు. మొత్తానికి టిడిపి-భాజపాల మధ్య ఏదో జరుగుతోందనటానికి ఇదేమన్నా నిదర్శనమా?
