అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల వేధింపులతో తాము ఆత్మహత్య చేసుకుంటున్న సలాం కుటుంబ సభ్యులు సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి మరణించిన విషయం తెలిసిందే. 

సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. పోలీసుుల తమ విధులు నిర్వహిస్తే అరెస్టు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. 

నంద్యాలలోని సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. హిందూ మతానికి అన్యాయం జరిగిందని తాము అంటే మత రాజకీయాలు చేస్తున్నారని అంటారని, ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు చేసేవి మత రాజకీయాలు కావా అని ఆయన అడిగారు. ముస్లింలే మనుషులు గానీ మిగతా వాళ్లు మనుషులు కారా అని ఆయన అడిగారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మిగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతోందని ఆయన విమర్శించారు. ఎర్రచందనం స్మిగ్లింగ్ కు ప్రభుత్వం సహకరిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలకు అనుమతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ముస్లింలో పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. టీటీడీలో అక్రమాలను ప్రశ్నిస్తే తమపై హిందూత్వ ముద్ర వేస్తున్నారని విమర్శించారు విదేశీ విద్యా పథకానికి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఘాట్లు నిర్మించినప్పుడు రూ. 200 కోట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

పోలవరం నిర్మాణంపై అసత్య ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. ముంపు మండలాలపై టీడీపీ, వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.