అవసరమైన చోట జూ. ఎన్టీఆర్ సేవలు వినియోగించుకొంటాం: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సేవలను అవసరమైన చోట వినియోగించుకొంటామని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువని ఆయన తెలిపారు. గత నెల 21న జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయిన విషయం తెలిసిందే.
అమరావతి: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజా దరణ ఎక్కువని బీజేపీ ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సోము వీర్రాజు చెప్పారు. అవసరమైన చోట జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.
ఆదివారం నాడు సోము వీర్రాజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ సభలు నిర్వహిస్తే జనం ఎక్కువగా ఎక్కడికి వస్తారని సోము వీర్రాజు ప్రశ్నించారు. అవసరమైన చోట జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకొంటామన్నారు. తమ పార్టీలో సినిమా నటులు లేరన్నారు. ఇప్పుడిప్పుడే కొందరు సినిమా నటులు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాజకీయాలు కొంతమందే చేయరు, అందరూ రాజకీయాలుచేస్తారు కదా అని మీడియాను ప్రశ్నించారు. అందరూ సినిమా యాక్టర్లే అంటూ రాజకీయ పార్టీల నేతలనుద్దేశించి సోము వీర్రాజు సెటైర్లు వేశారు తమ పార్టీకి చెందిన వారే సామాన్య కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నామని సోము వీర్రాజు వివరించారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. ఈ విషయమై మాకు స్పష్టత ఉందన్నారు. కానీ మీడియా ప్రతినిధులకే అనుమానాలు వస్తున్నాయన్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబ వైఖరిలో తమ వైఖరిలో మార్పు లేదని ఆయన చెప్పారు. కుటుంబ పార్టీలకు దూరమని పార్టీ నాయకత్వమే చెప్పిందని సోము వీర్రాజు గుర్తు చేశారు.
గత నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో హైద్రాబాద్ శంషాబాద్ లో గల నోవాటెల్ హోటల్ లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. సుమారు అరగంటకు పైగా ఈ భేటీ కొనసాగింది.
మునుగోడులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత అమిత్ షా ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ భేటీ జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన ను చూసి కేంద్ర మంత్రి అమిత్ షా అభినందించేందుకు ఈ సమావేశం జరిగిందని బీజేపీ నేతలు ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా ఈ భేటీ జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీలో రాజకీయాలకు సంబంధించి చర్చ జరగకుండా ఉంటుందా అనే రీతిలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యలు చేశారు. మరో వైపు అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు రాజకీయాల్లో మార్పులకు పునాది అని కూడా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.