వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....

విశాఖపట్నంలోని కంబాలకొండలో ‘కాపుల ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విజయసాయిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు హాజరయ్యారు. అయితే విజయసాయిను చూడగానే కార్యక్రమానికి వచ్చిన కొందరు ఆయనకు వ్యతిరేకంగా జై కాపు.. జై జై కాపు అంటూ నినాదాలు చేశారు.

 దీంతో కార్యక్రమంలో ఆందోళన చోటుచేసుకుంది. కొందరైతే కాపుల సమావేశానికి రెడ్డి కులస్తులను ఎలా  తీసుకు వస్తారు..? అంటూ కాపులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఏం చేయాలో పాలుపోని ఎంపీ మిన్నకుండిపోయారు.
 
ఈ కార్యక్రమంలో భాగంగా విజయసాయి మాట్లాడుతూ.. తాను కాపునేనని మీలో ఒక్కడినని.. చనిపోయే ముందు తన డెత్ సర్టిఫికెట్ మీద కాపు అంటూ ఉంటుందంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం అవంతి మాట్లాడుతూ.. తాను మంత్రి పదవిలో ఉన్నందున సహనంగా వున్నానన్నారు. జిల్లాలో 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే తనకొక్కడికే మంత్రి పదవి దక్కిందని కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ పలువురు నేతలు మాట్లాడగా.. ఇలాంటి కార్యక్రమంలో రిజర్వేషన్ గురించి మాట్లాడటం సబబు కాదని అవంతి ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు.