ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అనంతపురంలో ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ పథకాన్ని ప్రారంభిచారు. కాగా... ఈ సభకు ప్రజలు కూడా వేల సంఖ్యలో తరలి వచ్చారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్ట నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే... ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, డిప్యుటీ ముఖ్యమంత్రి ఆళ్ల నానికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం భద్రతా సిబ్బంది కారణంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎంపీ గోరంట్ల అసౌకర్యానికి గురి కావడం గమనార్హం.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్టాల్స్‌ను సందర్శించారు. అయితే ముఖ్యమంత్రి ఒక స్టాల్‌ నుంచి మరో స్టాల్‌కు వెళ్లే సమయంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయన వెంటే నడవడానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో సీఎం భద్రతా సిబ్బంది మంత్రి ఆళ్లనానిని పక్కకు నెట్టారు. మరో రెండు నిమిషాలు అనంతరం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు అదే పరిస్థితి ఎదురైంది. 

సీఎం భద్రతా సిబ్బంది ఎంపీ, డిప్యుటీ సీఎం ని చేతులతో ఆపడం గమనార్హం.  అలా చేయడంతో నేతలు ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. కాగా... దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై ఈ నేతలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.